Sree PadaVallabha
- Suman Prasad
- Jul 15, 2023
- 1 min read

ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు.
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో భాస్కర పండితులు త్రిమాతలు గురించి తెలియజేస్తూఉన్నారు.
భాస్కర పండితులు: ఇదే విధముగా శ్రీపాదుల వారు అనఘాలక్ష్మీ సమేత అనఘుడుగా ఉందురు. ఇది వారి అర్ధనారీశ్వర రూపము.
అయితే, శ్రీపాద శ్రీవల్లభుల రూపమున యతీశ్వరులుగా ఉన్నారు.
సగుణ సాకారము లందలి మర్యాదలను, పరిమితులను తూ.చ. తప్పకుండా పాటించవలెనని చెప్పుదురు.
ఇదియే ధర్మసూక్ష్మము.
ధర్మము వేరు, ధర్మసూక్ష్మము వేరు.
దివ్యానుగ్రహము వర్షించుటకు శ్రీపాదుల వారు సృష్టిరూపమున ఉన్నారు.
సృష్టిలో తాదాత్మ్యస్థితి యందు ఉన్నారు కనుక మానవుల వికాసము త్వరితగతిన జరుగునని దాని తాత్పర్యము.
శ్రీపాదుల వారు జపధ్యానములందును, తపస్సునందును వుండెదరు.
ఆ తపోఫలమును వారేమీ ఉంచుకొనరు. అది సృష్టికి అంతటికీ ధారాదత్తము చేయబడును.
భక్తులను ఆదివ్యాధుల నుండి రక్షించుటకు తమ తపోఫలితమును ధారపోసి కర్మబంధ విముక్తులను చేయుదురు.
జగన్మాత యొక్క నాలుగు శక్తులు మహా సరస్వతి, మహాలక్ష్మీ, మహాకాళీ, రాజరాజేశ్వరీ అనునవి ఈ విశ్వములో దైవాభివ్యక్తి కోసము, విశ్వ పరిపాలన కోసము ఆవిర్భవించినవి.
అంబికకు మూడుస్థాయిలు కలవు. అతీతమైనస్థాయి, విశ్వస్థాయి, వ్యక్తిస్థాయి.
అసలు సృష్టి జరుగక ముందు పరాశక్తి అతీతస్థాయిలో ఉంటుంది.
పరమాత్మలో ఉన్న అనంతమైన సత్యాలను ఆమె తనలోనికి ఆకర్షించి, తన చైతన్యములో ప్రవేశించిన తరువాత ప్రపంచసృష్టిగా జన్మనిస్తుంది.
సృష్టించడం తోనే ఆమె పని పూర్తి కాదు.
జీవులందరినీ సృష్టించి, తనలో వహించి, వారిలో ప్రవేశించి, వారిని బలపరుస్తుంది. ఇది ఆమె విశ్వస్థాయి.
ఇక వ్యక్తిస్థాయిగా ఆమె మానవ వ్యక్తిత్వానికి, దివ్య ప్రకృతికి మధ్య మధ్యవర్తిగా ఉంటుంది.
ఇదియే అనఘాలక్ష్మీ రూపముగా ఆవిర్భవించుట లోని రహస్యము.
తన మూలతత్వము నుండి కొన్ని అంశలను అవతరింపచేస్తుంది. ఆ అంశలు నిర్వహించవలసిన పని పూర్తి అయినప్పుడు వాటిని తిరిగి తన మూలతత్వము లోనికి ఆకర్షిస్తుంది.
అనఘుని యొక్క సంకల్పము లేనిదే అనఘాలక్ష్మి ఒక్క చిన్నపనిని కూడా చేయదు. తన ప్రభువు యొక్క సంకల్పము ఆమె నెరవేరుస్తుంది.
శ్రీపాద శ్రీవల్లభ రూపములో తల్లియునూ, తండ్రియునూ కూడా తానే గనుక అనుగ్రహము విశేషంగా ఉంటుంది.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు
Comments